2, ఫిబ్రవరి 2016, మంగళవారం

నిజామ్ నవాబ్ అగు ముల్క్ ఇబ్రహీమ్ కవి పణ్డిత పోషకుడై ఉండెను. తెలుగులో అతనిని మల్కిభరాముడని  పిలిచేవారు. ఒక రోజు అతడు తన ఆస్థానకవికి ఈ క్రింది సమస్య ఇచ్చి పూరించమనెను. " నాలుగు కుండలుండవలె. నా పేరుండవలె. అటువంటి పద్యమును చెప్పుము." అప్పుడా కవి ఆశువుగా ఈ క్రింది పద్యమును చెప్పెను.
ఆకుండ కల్పవృక్షమ!
ఈకుండగ లోభివగుదు-విహపరములకున్ |
నీకుండగ మాకిచ్చుట
మాకుండగనడుగవలదు-మల్కిభరామా! ||
ఈ పద్యము ఆది-అనుప్రాసకు ( beginning rhyme ) చక్కని ఉదాహరణము.
ఆది శంకరాచార్యులవారు తమ భజగోవిందస్తోత్రములొ ఆది-అనుప్రాస కలిగిన ఈ క్రింది పద్యమును చెప్పియున్నారు.
గేయం గీతానామసహస్రం, ధ్యేయం శ్రీపతిరూపమజస్రం | నేయం సజ్జనసంగే చిత్తం, దేయం దీనజనాయ తు విత్తమ్ ||
సంస్కృతసాహిత్యములో ఆదిశంకరాచార్యులవారే అంబాష్టకమను మరియొక స్తొత్రములో అన్ని పద్యములలోను ఈ ఆది-అనుప్రాసను పాటించియున్నారు.  ఉదాహరణకు అందులోని మొదటి  పద్యమును ఇచ్చుచున్నాను.  ఈ స్తోత్రమును  కాళిదాసకృతకాళికాదశశ్లోకీ అని కొంతమంది పిలిచెదరు.
చేటీభవన్నిఖిలఖేటీ కదంబతరువాటీషు నాకిపటలీ-,
కోటీరచారుతరకొటీమణీకిరణకోటీకరంబితపదా |
పాటీరగంధికుచశాటీ కవిత్వపరిపాటీమగాధిపసుతా,
ఘోటీకులాదధికధాటీముదారముఖవీటీరసేన తనుతామ్ ||